Tuesday, December 13, 2016

"భారతదేశం నా మాతృ భూమి - భారతీయులందరూ నా సహోదరులు " ఈ పాఠశాల ప్రతిజ్ఞ గుర్తుంటే

"భారతదేశం నా మాతృ భూమి - భారతీయులందరూ నా సహోదరులు " ఈ పాఠశాల ప్రతిజ్ఞ గుర్తుంటే,
యూనివర్సిటీ లో చేరిన విద్యార్థి, కులాల పేరుతో గ్రామాలలో చిచ్చుపెట్టే, పిచ్చిపనులు చేయడు.

సామాజిక సమరసత అంటే - ప్రతి మనిషిని సమభావం తో, సోదరభావంతో చూడటం, గౌరవించడం, ప్రేమించడం ఒక సంస్కారం. సోదరభావాన్ని, సంఘీభావాన్ని అలవరచుకోవాలి. అప్పుడే సమాజం పటిష్టం అవుతుంది.దేశ సమగ్రత పెరుగుతుంది. ప్రజల సహజీవనం సులభం అవుతుంది.జన జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. మనం కేవలం మన జీవితానికి మాత్రమే పరిమితం కాకుండా, మన కంటే వెనుకబడి వున్న వారికి చేయూతనిచ్చి సహాయ పడాలి. సమాన అవకాశాలు కల్పించాలి. దేశ సమైక్యతకు కృషి చేయాలి. సమాజ అభివృద్ధికి జరిగే అన్ని కార్యక్రమాల లో పాల్గొనాలి
సమాజసేవలో , సాంఘిక దురాచారాల నిర్మూలన లో తమ జీవితాలను అర్పించిన మహాత్మా ఫూలే, ఆయనకు ప్రేరణనిచ్చిన స్వామి దయానంద సరస్వతి, డాక్టరు బి.ఆర్ అంబేద్కర్, ఆయనకు స్ఫూర్తి నిచ్చిన రామభక్తుడు కబీరు, బుద్ధుడు, అంబేద్కర్ నడిపించిన ఉద్యమానికి మద్దతు నిచ్చిన వీరసావర్కర్, స్వఛ్చ భారత్ కి ఆద్యుడు గాడ్గేబాబా, ఛండాలుడిలొ భగవంతుని దర్శించిన పూజ్యులు ఆదిశంకరులు,సమతా మూర్తి శ్రీ శ్రీ రామానుజాచార్యులు, మహనీయ మహావీరుడు , వెనుకబడిన బస్తీలో మరుగుదొడ్లు శుభ్రపరచిన భగవత్ మూర్తి రామకృష్ణులు, పేద,దళిత, దీన జనుల కోసం తపించిన స్వామి వివేకానంద, భక్తితో సామాజిక ఉద్యమం నడిపించిన నారాయణగురు, మాదిగ అయితేనేమి మహనీయుడు గా పేరుగాంచిన సంత్ రవిదాస్, హైదరాబాద్‌లో భాగ్యరెడ్డి వర్మ, రాజారాంమోహనరాయ్, గురునానక్, గురుగోవిందసింహ, ఒకరిని మించినవారు ఇంకొకరు సామాజిక,ఆర్థిక, సాంస్కృతికంగా వెనకబడిన వారి వికాసం కోసం తమ జీవితాలను ధారపోశారు.
వందల సంవత్సరాలు గా బానిసత్వం లో మ్రగ్గిన మన సమాజంలో మధ్యంతరంగా వచ్చి చేరిన వికృతులు,దురాచారాలను చూసిన డా.బిఆర్ అంబేద్కర్ హిందూ సాంఘిక వ్యవస్థ లపై ధ్వజమెత్తడమే కాకుండా హిందుత్వాన్ని శుభ్రపరిచి, విప్లవీకరించడానికి,పునర్వ్యవస్థీకరించి,చైతన్యవంతం చేయటం ద్వారా చరిత్రలోనే అపూర్వమైన ఒక మానసిక విప్లవానికి శంఖం ఊదిన మహానుభావుడు. షెడ్యూల్డ్‌ కులాల హిందువులకు ఆయన చేసిన సేవ,ప్రపంచంలోని పేదలలొ కెల్ల పేదలకు చేసిన సేవయని " డాక్టరు బిఆర్ అంబేద్కర్ -లైఫ్ అండ్ మిషన్" అను పుస్తకంలో ధనంజయ కీర్ వ్రాస్తారు. అంబేద్కర్ బ్రతికున్నప్పుడే వ్రాసి, అంబేద్కర్ కి చూపించి ఆమోదం పొందిన పుస్తకం ఇది.
వివిధ వర్గాలు, కులాలు, వున్న ఈ భిన్నత్వం కలిగివున్న దేశంలో, ఏకత్వాన్ని, సౌందర్యాన్ని దర్శించి, కలసిమెలసి జీవించినప్పుడే దేశం పురోగతి చెందుతుంది. ఒక కులాన్ని, మరొక కులంపై ఎగదోసే ఈర్యాద్వేషాలు, కుల వివక్షత లు, అంటరానితనం మన ప్రగతికి అడ్డుగోడలు గా భావించవచ్చు. ప్రజల మధ్యన సామరస్య భావన నిర్మించాలి.
:మేమంతా ఒక్కటే, మేము ఒక కుటుంబానికి చెందినవారం. "భారత దేశం నా మాతృభూమి ..భారతీయులందరూ నా సహోదరులనే " పాఠశాల ప్రార్థన ను గుర్తుకు తెచ్చుకున్నప్పుడు, ఉన్నత విద్యకోసం విశ్వవిద్యాలయాలలో చేరి స్వంత గ్రామాలలో కులాల మధ్య చిచ్చుపెట్టే మనస్తత్వం, దుస్థితి రానే రాదు. మన మహనీయుల చరిత్ర నుండి పాఠాలు నేర్చుకొని సామాజిక సమరసత కోసం కృషి చేద్దాం. కలత ల్లేని సమాజాన్ని నిర్మిద్దాం. సోదరభావాన్ని కలిగి, ఆచరణలోకి తెచ్చినప్పుడే, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు సార్థకత లభిస్తుంది.
- అప్పాల ప్రసాద్.

2 comments:

 1. "భారతదేశం నా మాతృ భూమి - భారతీయులందరూ నా సహోదరులు " ఈ పాఠశాల ప్రతిజ్ఞ గుర్తుంటే

  ReplyDelete
 2. మంచి సందేశం
  యువతకి.

  ReplyDelete

  స్వామి వివేకానంద వీడియో పాటలు

  సంప్రదించు

  Name

  Email *

  Message *

  స్వామి వివేకానంద పాటలు

  Followers