ఖమ్మం జిల్లా బోనకల్ మండలకేంద్రంలో సామాజిక సమరసతా సమ్మేళనం జనవరి 3 , బుధవారం సాయంత్రం 6 గంటలకు శివాలయం ప్రాంగణంలో ఘనంగా జరిగింది.
కమ్యూనిస్టుల కంచుకోటగా భావించే ఈ గ్రామంలో 180 మంది అయ్యప్ప స్వాములతో , 10 గ్రామాల నుండి వచ్చిన 100 మంది భజన భక్తులతో , బోనకల్ గ్రామంలో ని అన్ని వర్గాలకు చెందిన సుమారు 600 మంది ప్రజలతో అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం నిర్వహించబడింది.
పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో "దేశం మనదే" పాట పై నృత్యం చేశారు. 'అందరు కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడా మాధవుడు', ' నంద లాలా యదు నంద లాలా' , 'లింగనికి, రంగనికి భేదమా' వంటి భజన గీతాలతో , 'కొడుకా నన్ను కోతాకమ్మకురా' అనే గోమాత వేదనా గీతం తో ప్రజలు తన్మయత్వంతో, ఉద్వేగం తో హిందుత్వ భావనకు లోనయ్యారు.
లెక్చరర్ రంగారావు, అధ్యక్షతన ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఇన్ స్పెక్టర్ జనరల్ శంకర్ రావు, జెడ్పిటిసి కొండా (సిపిఎం నాయకుడు), సమరసతా రాష్ట్ర కార్యదర్శి జయపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రాజా రావు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర రావు, శివాలయం దేవాలయం సమితి అధ్యక్షులు తిరుపతయ్య, కర్లపూడి లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.
సామాజిక కార్యకర్త రాఘవ మరియు ఆయన మిత్రులు ఈ కార్యక్రమం భుజాన వేసుకొని, సుమారు 200 గృహాలు సంపర్కం చేసారు. ఫలితంగా ఎక్కువ సంఖ్య లో కుటుంబాలు తరలివచ్చాయి.
సుమారు 18 కుల వృత్తుల వారికి, అయ్యప్ప గురుస్వాములకు, తిరుపతయ్య గురు స్వాములకు, విద్యా, వైద్య, భజన రంగాలలో సేవలు చేస్తున్న వారికి ఈ సందర్భంగా శాలువ, స్వామి వివేకానంద చిత్రం అందించి సత్కరించారు. ఆ తరువాత సామూహిక భోజనాలు నిర్వహించారు.
స్వామి వివేకానంద, అంబేద్కర్, సంత్ సేవాలాల్, కొమరమ్ భీమ్ వంటి మహనీయుల అడుగుజాడల్లో కుల వివక్షత, అంటరానితనాన్ని నిర్మూలించి, అందరిలోనూ భగవంతుడు వున్నాడన్న భావనతో మనిషిని మనిషి సద్భావనలతో గౌరవించే మానవత్వం అలవరుచుకోవాలని అతిథులు తమ ప్రసంగాల్లో కోరారు.
0 comments:
Post a Comment