రక్తపుటేరులు పారకుండానే నిమ్నవర్గాలకు స్వాతంత్ర్యం అందించిన అహింసా మూర్తిఇతరకులాల పై ఎస్ సి లలో ద్వేషము రగిలించకుండానే స్వేచ్ఛ ప్రసాదించిన మానవతా వాది.
కాషాయవస్త్రం ధరించి లక్షలాది బడుగువర్గాలను విదేశీ భావాలకు బానిసలు కాకుండా కాపాడిన కారుణ్య మూర్తి.
1860 లో అమెరికాలో బానిసత్వం వ్యతిరేకిస్తూ జరిగిన అంతర్యుద్ధంలో 6 లక్షల 20 వేల మంది మరణించారు. లక్షల మంది గాయాల పాలయ్యారు. వేలమంది వికలాంగులయ్యారు. ఆస్తి నష్టం చెప్పడం కష్టం. 1793-94 లో ఫ్రాన్స్‌లో రాచరికం పై తిరుగుబాటుచేసి ప్రజల హక్కులను సాధించే పోరులో 40 వేల మంది చనిపోయారు. మన దేశం కంటే చిన్నదైన ఫ్రాన్స్‌లో భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. కమ్యూనిస్టు రష్యాలో లెనిన్ 60 లక్షల మందిని చంపించాడు. స్టాలిన్ 4 కోట్ల మందిని చంపించిన విషయం ప్రపంచానికి తెలుసు.
డా.అంబేడ్కర్ 1927 నుండి ప్రారంభించిన ఉద్యమ ప్రస్థానం లో స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఒక్కరంటే ఒక్కరు కూడా చావలేదు. పూర్తిగా అహింసా యుతంగా పోరాటం నడిపారు. మహాడ్ లోని మంచినీటి ఉద్యమం, నాసిక్‌లో ని కాలారామ్ మందిర ప్రవేశం, కొల్హాపూర్ అంబామాత మందిర ప్రవేశ ఉద్యమం......ఇలా ఏది చూసినా హింసకు తావులేకుండా సమాజపరివర్తన సాధించిన మహామనీషి.
రెండున్నర వేల సంవత్సరాల క్రిందట బుద్ధుడు చేసిన పనిని వివేకానందుడు, గాంధీజీ, డా.అంబేడ్కర్ లు చేసిన ప్రయత్నాల ఫలితముగా షెడ్యూల్డ్ కులాల వారు రాష్ట్ర పతులు, కేంద్రమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కాగల్గుతున్నారు. సామాజికంగా, ఆర్థికంగా, వైజ్ఢానికంగా ఎందరో షెడ్యూల్డ్ కులాల వారు ముందంజలో వున్నారంటే డా.అంబేద్కర్ వల్లనే ఇది సాధ్యం అయింది.
ఇంకా సాధించవలసింది ఎంతో వుంది. అందుకు బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన ప్రేమాభిమానాలతో, సహనంతో, సంయమనంతో కూడిన మార్గమే శరణ్యం.
అయితే కొందరు ఐపిఎస్, ఐఎఎస్,ప్రొఫెసర్స్ మరో అంబేడ్కర్ ల వలె భావిస్తూ దళితులను రెచ్చగొడుతున్నారు. అసాంఘిక శక్తులు దీనిని ఆసరగా చేసికుని గ్రామాలలో సమస్య లు సృష్టిస్తున్నారు. పచ్చగా బ్రతికే పల్లెల్లో కూడా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. 9వ తరగతి విద్యార్థి మొదలు యూనివర్సిటీ విద్యార్థుల వరకు ఇతర కులాల వారిని, వారు ఆరాధించే దేవతలను బండబూతులు తిడుతున్నారు. అట్రాసిటీ కేసులను అడ్డం పెట్టకుని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది మా అంబేడ్కర్ మాకిచ్చిన లైసెన్సు అంటూ ఈ అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నారు.
దీనివల్ల అంబేడ్కర్ ఆశయాలకు నష్టం వాటిల్లుతుంది. అందరితో కలిసి జీవించే వాతావరణం దెబ్బతింటుంది. అందరి హృదయాలనుండి అంబేద్కర్ ని దూరం చేయొద్దు. అందరివాడు మా అంబేద్కర్ అని, ఆయన కన్న కలలను అన్ని వర్గాలు ఏకమై సాధించుకుందాం.
- అప్పాల ప్రసాద్.
హింసకు తావులేకుండా సమాజపరివర్తన సాధించిన మహామనీషి
ReplyDelete