పాశ్చాత్య దేశాలలో యోగులు కాగలిగేవారు లేరా? ఎందుకు లేరు?
నిస్వార్థ పరులు, దైవభక్తి వున్న వారు, కోరికలు అదుపులో పెట్టుకొన్నవారు వున్నారు. అయితే వారి జీవితాన్ని ఇప్పటికన్నా మరింత మెరుగైన దారిలో, ఉన్నత స్థితి ని అందుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్న వారికి యోగం అనే నిర్దుష్టమైన శాస్త్రాన్ని అందించేది ముమ్మాటికి భారతదేశమే.
నిజమైన యోగి ప్రపంచానికి విధివిధేయుడై వుంటాడు. నీటి మీద వెన్నముద్ద వలె క్రమశిక్షణతో వుంటాడు. కేవలం సిద్దాంతం మాత్రమే పొందుపరచి లేదు. ఆచరణ సాధ్యము అని నిరూపించిన తర్వాతనే శాశ్వతంగా బాధలు తొలగించి, అక్షయ ఆనందం కలిగించే సమగ్ర శాస్త్రం' యోగం ' ప్రపంచంలోకి అడుగు పెట్టింది.
ఆధ్యాత్మిక విలువలు కలిగి, ఇతరులను ఎవరినీ హింసించకుండా, సత్య ధర్మాలు పాటిస్తూ, ఇతర దేశాల వస్తువులు ఏవీ దొంగిలించకుండా, ఇతరుల వనరులపై ఆశపడకుండా, కోరికలను నియంత్రించుకొని, తమ మనసులను స్వచ్ఛంగా ఉంచుకొని, వున్నదానితో సంతృప్తి పొందుతూ, సాధన చేస్తూ, ఆత్మ విచారణ జరుపుతూ, భగవంతుడి పై,గురువుపై భక్తి కలిగి, ఆసనములు వేస్తూ, సూక్ష్మమైన ప్రాణప్రవాహాలను ప్రాణాయామము ద్వారా అదుపులో వుంచి, ఇతర వస్తువుల పై కోరికలు లేక, ఏకాగ్రతతో, దైవచింతన లో కాలం గడుపుతూ సమాధి చేతన ను "యోగ విద్య ' ద్వారా ప్రయత్నించి పొందే మహాత్ములు ఎందరో ఈ భూమిమీద కనిపిస్తారు.
భగవద్గీతలో చెప్పిన కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాలను సామాన్యులు కూడా అందుకొని, ఆనందించేందుకు వీలుగా ప్రయత్నాలు , పరిశోధనలు ఎన్నో జరిగాయి. ఇంకా జరుగుతూనే వున్నాయి.
- అప్పాల ప్రసాద్.
0 comments:
Post a Comment