ప్రపంచం లోని వివిధ మతాలు,పంథాల మధ్య తలెత్తుతున్న ఘర్షణలు,విభేదాలు తొలగిపోవాలంటే దేశాల మధ్య శాంతి సమన్వయం అవసరముందని అన్ని దేశాలకు అనుభవం లోకి వస్తుంది.వివిధ మత సిద్ధాంతాలను సమన్వయం చేసేపనికి హిందువు ప్రయత్నం మొదలు పెట్టాడు. ఆనాడు చికాగో మత సభలో వివేకానంద ప్రకటించాడు. 10 మతాల ప్రతినిధులు అంగీకారంతో తలలూపారు.ఆ శాంతి గర్జన ప్రకంపనలు ఇంకా ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.అందుకే ఐక్య రాజ్య సమితి లో అందరిని మనస్సులను ఏకం చేసి శాంతినిచ్చే యోగ దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదించగానే 177 దేశాలు మతాల కతీతంగా మద్దతిచ్చాయి.జూన్ 21 హిందూ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించే రోజు. స్వామి వివేకానంద తరువాత ఇన్ని రోజులకు హిందువు ప్రపంచాన్ని ఏకం చేయబోతున్నా అద్భుత సంఘటన ఇది.ఐక్య రాజ్య సమితి చరిత్రలోనే మొదటి సారిగా 177 దేశాల మద్దతు యోగ దినోత్సవానికి లభించింది.మొదటగా నేపాల్ సమర్థించగా చైనా తో పాటు ముఖ్యమైన దేశాలన్ని అంగీకారం తెలిపాయి.
డిసెంబర్ 2011 లో మొదట శ్రీ శ్రీ రవిశంకర్ ఇంటర్నేషనల్ యోగ డే కోసం వినతి చేసారు.4 సంవత్సరాల వరకు యోగ భరత మాత పొత్తిళ్ళ నుండి జారిపోయి ఒక అనాథగా ప్రపంచ వీధుల్లో తిరుగాడుతుంటే నరెంద్ర మోడి ఐక్య రాజ్యసమితిలో అన్ని దేశాలకు అప్పగించి ఆ అనాథను పెంచి పోషించే బాధ్యత ను వాటి మీద మోపాడు. వాస్తవంగా అది అనాథ కాదని ఆ యోగ దుఖాల నుండి మనకు విముక్తి కలిగించ వచ్చిన భగవత్స్వరూపమని వివరించగానే 177 దేశాలు ఆనందం తో ఉబ్బితబ్బిబ్బయ్యాయి.జూన్ 21 కోసం కన్నులు కాచేట్లు ఎదురుచూస్తున్నాయి.
ప్రపంచాన్ని క్రైస్తవమయం చేస్తాం,లేదా ఇస్లాం మయం చేస్తాం అంటూ విర్రవీగే మతాధిపత్య ధోరణి కాదు.అన్ని మతాలను గౌరవిస్తూ,ఒకరు ఇంకొకరిని కబళించకుండా పూలమాలలో దారం వలె అందరూ శాంతితో జీవించాలని హిందూ ధర్మం ప్రవచించే యోగ దృశ్యాన్ని ప్రపంచం చూడబోతున్నది.యోగం అంటేనే కలపటం.ఆ కల నిజమవుతున్నది. ఇది తిరుగులేని సత్యం.
మరి యోగ మీద వస్తున్న విమర్శల మాటేమిటి? తప్పదు. రామున్ని విమర్శించే వాలి,రావణాసురులు లేకుండిరా? కృష్ణున్ని ఆడిపోసుకునే శిశుపాలుడు,కంసులు,కౌరవులు ఆ రోజు కూడా వుండిరి కదా? సుభాష్ చంద్ర బోస్ ని "హిట్లర్ బూట్లు నాకే కుక్క" అని తిట్టిన కమ్యూనిష్టులను చూడలేదా? గాంధిని "మూడు కోతుల తాత" అని ఆరోపించలేదా? యాంప్లిఫైర్ల వలే అరవడమే తప్ప ఆలోచించడం చేతకాని మూర్ఖులు నేడు యోగ దినోత్సవాన్ని వ్యతిరేకించటం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు.
అన్ని భాషలు,అన్ని మతాలు,అన్ని పంథాలు,అన్ని దేశాలు హిందువు కోరుకునే వసుధైక కుటుంబంలోకి రాబోవటం తథ్యం.హిందువుకి మితృలే తప్ప శతృవులు లేరు. హిందువు కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడయ్యాడు.ఆ ధ్యానం లో ప్రపంచ దేశాలు ఆధ్యాత్మికత కోసం పరితపిస్తున్న దృశ్యం కనపడింది. దానికి అంతర్జాతీయ యోగ దినోత్సవం ఒక నాంది(ప్రారంభం) మాత్రమే.
- అప్పాల ప్రసాద్.
జూన్ 21 హిందూ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించే రోజు
ReplyDelete